-: పద్యాలు:-
౦౧ అ ఆ ఐ ఔ లకు మఱి
ఇ ఈ లు ఋకారసహిత మె ఏ లకు నౌ
ఉ ఊ ల్దమలో నొడఁబడి
ఒ ఓ లకు వళ్లగు న్నయోన్నతచరితా!
౦౨ ఇంతకు బూని వచ్చి వచియింపక పోదునె? విన్ము తల్లి! దు
శ్చింతులు దైత్యు చేబడిన సీతను గ్రమ్మఱ నేలుచున్నవా
డెంత విమోహి రాముడని యెగ్గులు వల్కిన నాలకించి భూ
కాంతుడు నిందజెంది నిను గానలలోపల డించి రమ్మనెన్
ఈ పద్యమూ, యీ సన్నివేశమూ అందరికీ సుపరిచితమే. సీతమ్మను అడవిలో వదిలిపెట్టడానికి తీసుకువచ్చిన లక్ష్మణుడి కంట కన్నీరు చూసి సీతాదేవి ఆందోళన పడి ఏమిటని అడుగుతుంది. పూర్వం వనవాసం చేసినప్పుడు కాని, ఇంద్రజిత్తుతో ముఖాముఖీ యుద్ధం చేస్తున్నప్పుడు కాని, రావణాసురుని శక్తి నీ ఱొమ్ములో గుచ్చుకున్నప్పుడు కాని, రాని కన్నీరు ఇప్పుడు వచ్చిందేమిటని అడుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు పలికిన మాటలివి. ఇంత చెయ్యడానికి సిద్ధపడి వచ్చి, యిప్పుడు చెప్పకుండా పోతానా తల్లీ, విను! అంటూ జరిగినది చెప్పే పద్యం. పద్యం ఎత్తుగడలోనే లక్ష్మణుడి దైన్యమంతా స్ఫురిస్తోంది. పద్యాన్ని రసవంతంగా నిర్మించడమంటే యిదీ. కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణంలోని పద్యమిది. సీతాదేవిని అడవిలో వదిలిపెట్టిపోయే సన్నివేశమంతా పరమ కరుణాత్మకంగా చిత్రించాడు పాపరాజు.
౦౩ అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
౦౪ దాశరథి "రుద్రవీణ" అనే కవితా సంపుటిలో "మూర్చన" అనే కవితలోని పద్యమిది
చింతలతోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బా
లింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గనువోని బిడ్డకున్
బొంతలు లేవు కప్పుటకు; బొంది హిమం బయిపోవునేమొ సా
గింతును రుద్రవీణపయి నించుక వెచ్చని అగ్నిగీతముల్
౦౫ తిక్కన భారతంలోని పద్యమిది. విరాట పర్వంలోది.
ఎవ్వాని వాకిట నిభమద పంకంబు
రాజభూషణ రజోరాజి నడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు
నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
ఎవ్వాని గుణలత లేడువారాశుల
కడపటి కొండపై గలయ బ్రాకు
నతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు
౦౬ శ్రీనాథుడు, శివుడు భిక్షకి వెళ్ళే సందర్భంలో ఎంత గోల గోలగా ఉంటుందో వర్ణించిన పద్యం . తలమీద చదలేటి దరిమీల దినజేరు
కొంగలు చెలగి కొంగొంగురనగ
మెడదన్ను పునుకుల నిడుపేరు లొండొంటి
బొరిబొరి దాకి బొణ్బొణుగురనగ
గట్టిన పులితోలు కడకొంగు సోకి యా
బోతు తత్తడి చిఱ్ఱుబొఱ్ఱు మనగ
గడియంపు బాములు కకపాలలో నున్న
భూతి మై జిలికిన బుస్సు రనగ
దమ్మిపూజూలి పునుకకంచమ్ము సాచి
దిట్టతనమున బిచ్చము దేహి యనుచు
వాడవాడల భిక్షించు కూడుగాని
యిట్టి దివ్యాన్నములు మెచ్చునే శివుండు!
౦౭ నన్నయ్యగారి పద్యం. మహాభారతం అరణ్యపర్వంలోది.
నలదమయంతులిద్దరు మనఃప్రభవానల బాధ్యమానలై
సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్
నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులన్
దలిరుల శయ్యలన్ సలిలధారల జందనచారుచర్చలన్
౦౮
శారదరాత్రులుజ్వల లసత్తర తారకహార పంక్తులం
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబులై
౦౯ మన్మథుడి గూర్చి కరుణశ్రీ గారి పద్యం
ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా
వసంతస్సామంతో మలయమరుదాయోధన రథః
తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి